ఈనెల 25వ తేదీ నుంచి సంగారెడ్డి వేదికగా సీపీఐఎం తెలంగాణ(CPM Telangana) రాష్ట్ర మహాసభలు జరుగనున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్‌ఆర్ గ్రౌండ్‌లో బహిరంగ సభ జరుగనుంది. ఆదివారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ ఆఫీస్‌లో మహాసభల పోస్టర్‌ను పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు(BV Raghavulu)తో కలిసి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.
ఫార్మా, హైడ్రా పేరిట పేదల ఇళ్లను కూల్చుతోందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభలోనే జగరాలని డిమాండ్ చేశారు. ఒకటి, రెండు మినహా ఇచ్చిన హామీల్లో ఏ పథకం కూడా సరిగా అమలు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. తాము ప్రభుత్వానికి మిత్రపక్షం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షం అయ్యి ఉంటే తాము కూడా కేబినెట్‌లో మంత్రి పదవులు తీసుకునే వాళ్లం అని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై త్వరలోనే పోరాటం మొదలు పెడతామని సంచలన ప్రకటన చేశారు.