- ముగిసిన వార్డు సభ్యుల ‘శిక్షణ’
నర్సాపూర్ (ప్రజాజ్యోతి) స్థానిక సంస్థల బలోపేతమే ధ్యేయంగా నర్సాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో గత ఐదు రోజులుగా కొనసాగిన వార్డు సభ్యుల శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. మొదటి విడతలో భాగంగా 11 గ్రామ పంచాయతీల నూతన వార్డు సభ్యులు ఈ శిక్షణా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ మహమ్మద్ మోఅజ్జమ్ హుస్సేన్ సభ్యులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
• విధుల్లో నిర్లక్ష్యం వద్దు: ఎంపిడిఓ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు తమ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీడీఓ మోఅజ్జమ్ హుస్సేన్ అన్నారు. పంచాయతీ రాజ్ చట్టాలు, నిధుల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తూ గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
