హైటెక్ నిఘా..వినూత్న సైన్ బోర్డులు..!
-ప్రమాదాలకు చెక్ పెడుతున్న సంగెం ఎస్సై వంశీకృష్ణ టీమ్…
-వేగానికి కళ్లెం ప్రాణానికి కవచం..పోలీసుల వినూత్న ప్రయోగం సక్సెస్
సంగెం, మార్చి27 (ప్రజాజ్యోతి):
వరంగల్ జిల్లా సంగెం మండలంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎస్సై వంశీకృష్ణ ఆధునిక సాంకేతికతతో కూడిన సైన్ బోర్డులను వినూత్న అవగాహన కార్యక్రమాలను శుక్రవారం రోజున డిసిపి అంకిత్ కుమార్, ఏసీపీ వెంకటేష్, సిఐ రాజగోపాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించగలమని అన్నారు. అనంతరం సైన్ బోర్డుల ప్రాముఖ్యతను వివరించారు. రోడ్ల పై ప్రమాదాలకు కారణమయ్యే అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ బోర్డులను రూపొందించామని తెలిపారు. ఈ సైన్ బోర్డులు వాహనదారులకు హెచ్చరికలు, సూచనలు ఇస్తూ అప్రమత్తం చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ముఖ్యంగా వేగ నియంత్రణ, మలుపులు, ప్రమాదకర ప్రాంతాల వద్ద వీటి ఉపయోగం ఎంతో ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇంతకు ముందు పోలీసులు ప్రవేశపెట్టిన 3డీ వెహికల్ నమూనా కూడా మంచి స్పందన పొందిందని, దానివల్ల వాహనదారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటూ ప్రమాదాలను నివారిస్తున్నారని తెలిపారు. ఈ వినూత్న చర్యలను చూసిన వాహనదారులు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలు అభినందనీయమని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పోలీసులు తెలిపారు.
