సిద్ధిపేట, మార్చి 25 , (ప్రజాజ్యోతి):సిద్దిపేట జిల్లాలో పెట్రోల్, డీజిల్ , వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజ తెలిపారు. ఆయిల్ రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా వ్యవస్థ పూర్తిస్థాయిలో, సక్రమంగా కొనసాగుతోందన్నారు. జిల్లాలో ప్రజల రోజువారీ అవసరాలకు తగినంత ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కనిపించడం లేదా తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు ఉంచడం వదంతుల ప్రభావంతో ప్రజలు ఒక్కసారిగా అధికంగా ఇంధనం కొనుగోలు చేయడం వల్లేనని తెలిపారు. ఈ కారణంగా సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు వరకు విక్రయాలు పెరిగినట్లు తెలిపారు.పెట్రోల్ లేదా డీజిల్‌ను డబ్బాలు, క్యాన్లలో నిల్వ చేయడం పేసో నిబంధనలకు విరుద్ధమని, ఇది ప్రమాదకరమని హెచ్చరించారు. అక్రమ నిల్వలు లేదా బ్లాక్ మార్కెట్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అడ్వాన్స్ పేమెంట్ విధానంలో మార్పుల కారణంగా స్థానిక డీలర్లకు తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడినప్పటికీ, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పెట్రోలియం సంస్థలు , పోలీస్ శాఖలతో కలిసి పెట్రోల్ బంకులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
