సిద్ధిపేట, మార్చి 14 , (ప్రజాజ్యోతి) :కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికు లేఖ రాశారు. 2020 నుంచి 2023 వరకు ఈ రిజర్వాయర్ల ద్వారా ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువలను పూర్తి చేసి సిద్దిపేట జిల్లాలో సుమారు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించుకున్నామన్నారు. కాలువల ద్వారా చెరువులు, కుంటలు, వాగులు, చెక్‌డ్యామ్‌లు నింపుతూ నేరుగా ఆయకట్టుకు నీరు అందించడంతో రైతులకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు అయినా కాలువల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, ఈ కాలంలో ఒక్క గజం కాలువ కూడా తవ్వలేదని విమర్శించారు. మైనర్, సబ్ మైనర్ కాలువల నిర్మాణానికి భూసేకరణ అవసరమని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినా స్పందన లేదన్నారు.రైతుల ప్రయోజనాల దృష్ట్యా అన్నపూర్ణ కు రూ.15 కోట్లు, రంగనాయకసాగర్ కు రూ.15 కోట్లు భూసేకరణ కోసం వెంటనే కేటాయించాలని కోరారు. ఈ 30 కోట్ల రూపాయలతో భూసేకరణ పూర్తయితే జిల్లాలో మరో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు సాధ్యమవుతుందన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొత్త ఆయకట్టు విస్తరణ నిలిచిపోయిందని, వేలాది మంది రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని హరీష్ రావు తెలిపారు. వెంటనే నిధులు మంజూరు చేసి కాలువల నిర్మాణాన్ని ప్రారంభించాలని రైతుల పక్షాన విజ్ఞప్తి చేశారు.
