విజయ్-రష్మిక పెళ్లి నిజమేనా? ఉదయ్‌పూర్‌లో వేడుకలంటూ జోరుగా ప్రచారం

V. Sai Krishna Reddy
2 Min Read

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్నల వివాహం గురించి గత కొద్దికాలంగా నడుస్తున్న ప్రచారానికి మళ్లీ రెక్కలొచ్చాయి. వీరిద్దరూ ఈ నెల 26న పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహ వేడుక జరగనుందని, ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని కథనాలు వస్తున్నాయి.

గతేడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇటు విజయ్ గానీ, అటు రష్మిక గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. ప్రస్తుతం పెళ్లి కోసం ఉదయ్‌పూర్‌లోని ఒక హెరిటేజ్ ప్యాలెస్‌ను ఎంపిక చేసుకున్నారని, నిశ్చితార్థంలాగే పెళ్లిని కూడా కొద్దిమంది కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యే నిర్వహించాలని ఈ జంట భావిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.

గత 24 గంటలుగా ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో పెళ్లికి సంబంధించిన డెకరేషన్ పనులు జరుగుతున్నాయంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ వీడియోల వాస్తవికతపై స్పష్టత లేదు. కొందరు ఫిబ్రవరి 2న పెళ్లి అని చెబుతున్నప్పటికీ, ప్రముఖ మీడియా సంస్థలు మాత్రం ఫిబ్రవరి 26 అనే తేదీనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నాయి.

అయితే, ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు విజయ్ దేవరకొండ గానీ, రష్మిక మందన్న గానీ అధికారికంగా స్పందించలేదు. గతంలో ఈ పుకార్లపై అడిగినప్పుడు, సమయం వచ్చినప్పుడు తానే మాట్లాడతానని రష్మిక తెలివిగా సమాధానమిచ్చారు. ఇటీవల ఎయిర్‌పోర్టులో ఇదే విషయంపై ప్రశ్నించగా, ఆమె నవ్వుతూ దాటవేశారు. ఇటీవలే ఈ జంట ఇటలీలో న్యూ ఇయర్ వెకేషన్ జరుపుకొని కలిసి హైదరాబాద్ తిరిగిరావడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది. ప్రస్తుతం రష్మిక ‘కాక్‌టెయిల్ 2’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ పెళ్లి వార్తలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *