భారత్‌కు ‘ఎల్‌నినో’ ముప్పు: ఈ ఏడాది కరువు ఛాయలు

V. Sai Krishna Reddy
1 Min Read

దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేసే ప్రమాదం కనిపిస్తోందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూమధ్య రేఖ ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల ‘ఎల్‌నినో’ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావంతో భారత్‌లో అనావృష్టి (కరువు) ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎల్‌నినో బలపడవచ్చని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే సమయంలోనే ఈ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండటం గమనార్హం. ప్రైవేట్ వాతావరణ సంస్థ ‘స్కైమెట్’ అంచనా ప్రకారం దక్షిణాసియా దేశాలపై ఈ ముప్పు ఎక్కువగా ఉండనుంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. జులై నెలలో ఎల్‌నినో పూర్తిస్థాయిలో ఊపందుకుంటుందని, తద్వారా సాగునీరు, తాగునీటి ఎద్దడి తలెత్తే కరువు పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఆసియా పసిఫిక్ క్లైమెట్ సెంటర్ కూడా హెచ్చరించింది.

గత కొద్దికాలంగా పసిఫిక్ మహాసముద్రంలో వర్షాలకు అనుకూలించే ‘లానినా’ ప్రభావం క్రమంగా బలహీనపడుతోంది. వచ్చే నెల నాటికి ఇది పూర్తిగా కనుమరుగై తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని, సరిగ్గా ఏప్రిల్ నుంచి ఎల్‌నినో తన ప్రతాపాన్ని మొదలుపెడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది శీతాకాలం ముగిసే నాటికి తీవ్ర రూపం దాల్చి, రుతుపవనాల గమనాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *