గ్రామంలో కుక్కల హత్యలు.. ప్రజల్లో ఆందోళన
* గ్రామంలో పిల్ల కుక్కల ఏడుపులు
దామెర, జనవరి 23 (ప్రజాజ్యోతి):
రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల్లో కుక్కల బెడద, కోతుల బెడదలు గ్రామాల్లో తగ్గిస్తామని ఇచ్చిన హామీల్లో భాగంగా కుక్కలను మందులు పెట్టి చంపుతున్న సంఘటనలు గ్రామాల్లో జరుగుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో కుక్కలను హత్య చేసి గ్రామ పంచాయితీ ట్రాక్టర్ లో తరలిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. గ్రామంలో వీధి కుక్కలను అక్రమంగా చంపుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొన్ని రోజులుగా విష ప్రయోగం చేసి కుక్కలను చంపుతున్నారనే ఆరోపణలతో కోర్టు జోక్యం చేసుకొని పూడ్చిన కుక్కలను సైతం తీసి పోస్టు మార్టం నిర్వహిస్తున్న సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలతో గ్రామాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
గ్రామంలో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉండటంతో ఈ తరహా చర్యల వల్ల ప్రజారోగ్యానికి కూడా ముప్పు ఏర్పడుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. మృత కుక్కలను తరలించడంతో వాటి పిల్ల కుక్కల ఏడుపులు ఆవేదన కలిగిస్తున్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జంతువులపై ఈ విధమైన అమానుష చర్యలు చట్ట విరుద్ధమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం – పంచాయితీ కార్యదర్శి
ఈ విషయమై పులుకుర్తి పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ వివరణ కోరగా.. తమ దృష్టికి రాలేదన్నారు. అలాంటివి జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కుక్కలను తరలించేందుకు గ్రామ పంచాయితీ ట్రాక్టర్ ఉపయోగించినట్టు అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలు చూపాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
