సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక మెడికల్ కాలేజీలో ఓ యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హాస్టల్ గదిలో పారాక్వాట్ గడ్డి మందు (పంట చేలలో కలుపు నివారణకు వినియోగించే విషపూరిత మందు) ఇంజక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లగా, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు.
వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య (2020 బ్యాచ్) సిద్దిపేట మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ పూర్తి చేసి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. శనివారం ఉదయం ఆమె తన హాస్టల్ గదిలోనే గడ్డి మందును ఇంజక్షన్ ద్వారా తీసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆమెను సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంటర్న్‌షిప్ డ్యూటీల ఒత్తిడి, మరోవైపు నీట్ పీజీ పరీక్షకు సిద్ధం కావాల్సి రావడం వంటి కారణాలతో లావణ్య తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు కాలేజీ సిబ్బంది భావిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
