టీ20 ప్రపంచకప్ – 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న క్రమంలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వంటి దేశాలు తమ జట్లను ప్రకటించాయి. తాజాగా పాకిస్థాన్ కూడా తమ తాత్కాలిక జట్టును వెల్లడించింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆదివారం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఒక స్టార్ ఆటగాడికి అవకాశం దక్కగా, మరో కీలక ఆటగాడు మాత్రం జట్టుకు దూరమయ్యాడు.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు సల్మాన్ అలీ ఆఘాను కెప్టెన్‌గా పీసీబీ ఎంపిక చేసింది. అయితే వైస్ కెప్టెన్‌ను మాత్రం ప్రకటించలేదు. కొంతకాలంగా ఫామ్‌లేమితో విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌కు చివరకు ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కింది.
అలాగే స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదికి కూడా జట్టులో చోటు లభించింది. అయితే అతని ఫిట్‌నెస్‌పై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఇటీవల బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతూ షాహీన్ మోకాలి గాయానికి గురయ్యాడు. అతనికి ప్రత్యామ్నాయంగా హారిస్ రౌఫ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
గతంలో వైట్‌బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించిన మహ్మద్ రిజ్వాన్‌కు ఈసారి జట్టులో చోటు లభించలేదు. అతని స్థానంలో వికెట్ కీపర్‌గా ఉస్మాన్ ఖాన్‌ను ఎంపిక చేశారు. స్పిన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ అనంతరం (జనవరి 11 తర్వాత) తుది జట్టును ప్రకటించనున్నట్లు పీసీబీ తెలిపింది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ గ్రూప్-ఏలో పోటీ పడనుంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు యూఎస్‌ఏ, నమీబియా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. భారత్ – పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది.
పాకిస్థాన్ జట్టు:
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, హారిస్ రౌఫ్, ఫకర్ జమాన్, మొహమ్మద్ వసీం జూనియర్, నసీం షా, అబ్దుల్ సమద్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్.
