తెలంగాణలో ఇంటర్నెట్ విప్లవం: మారుమూల పల్లెల్లోనూ 5G ‘వైర్‌లెస్’ సేవలు

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రతి గడపకూ హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. కేవలం కేబుల్ ద్వారానే కాకుండా, వైర్‌లెస్, శాటిలైట్ సాంకేతికతను జోడించి ‘డిజిటల్ తెలంగాణ’ కలను సాకారం చేసేందుకు అడుగులు వేస్తోంది.

భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కేబుల్ వేయడం సాధ్యం కాని 690 గ్రామాలను ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, మైనింగ్ జోన్లలో ఉన్న ఈ పల్లెలకు ఇంటర్నెట్ అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ కంపెనీతో ప్రభుత్వం మంతనాలు జరుపుతోంది. శాటిలైట్ ద్వారా నేరుగా ఇంటర్నెట్ అందించే ఈ సాంకేతికతపై టీ-ఫైబర్ అధికారులు ఇప్పటికే రెండుసార్లు స్టార్‌లింక్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఒప్పందం ఖరారైతే, ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల తండాల్లోనూ ఇంటర్నెట్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తుంది.

మధిరలో దేశానికే ఆదర్శం

వైర్‌లెస్ 5G సేవలను గ్రామీణ స్థాయిలో ప్రవేశపెడుతున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని రామకృష్ణాపురం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. ఇప్పటికే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా అమలవుతున్న ఈ సాంకేతికతను ఇప్పుడు పల్లె ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఐటీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

పనిచేసే విధానం ఇలా..

ఐఐటీ హైదరాబాద్ సహకారంతో ‘ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్’ విధానంలో ఈ సేవలు అందుతాయి. ఖమ్మం కలెక్టరేట్ పై అమర్చే మెయిన్ యాంటెన్నా నుంచి వైర్‌లెస్ సిగ్నల్స్ గ్రామ కేంద్రానికి చేరుతాయి. అక్కడి నుంచి విద్యుత్ స్తంభాలకు అమర్చిన వైఫై-7 హై సెక్యూరిటీ రూటర్ల ద్వారా గ్రామంలో ఎక్కడ ఉన్నా సరే వైఫై వాడుకోవచ్చు. తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ అంతరాయం కలగని విధంగా దీనిని రూపొందించారు. 2026 నాటికే రాష్ట్రవ్యాప్తంగా వైర్‌లెస్ 5G సేవలను పూర్తిస్థాయిలో అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *