అరే బిడ్డా కేటీఆర్.. నీకంటే మాకే అనుభవం ఎక్కువ’: కడియం శ్రీహరి నిప్పులు

V. Sai Krishna Reddy
1 Min Read

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌కు అహంకారం ముదిరిందని, మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండల కేంద్రంలో ఇటీవల గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ గతంలో చేసిన విమర్శలపై కడియం తీవ్రంగా స్పందించారు.

తనను, పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వాడిన పదజాలంపై కడియం తీవ్రంగా స్పందించారు. “మేము ఆడవాళ్లమో, మగవాళ్లమో తెలుసుకోవాలంటే స్టేషన్ ఘన్‌పూర్‌కు వచ్చి చూడు బిడ్డా.. ఇక్కడ 143 సర్పంచ్ స్థానాల్లో 100 మందిని గెలిపించుకున్నాం. మీ నాయన కేసీఆర్ కంటే వయసులో మేమిద్దరం రెండేళ్లు పెద్దవారం. నీకంటే మాకు రాజకీయ అనుభవం ఎక్కువ. మీ నాయన పదేళ్లు సీఎం చేస్తే.. నేను 14 ఏళ్లు మంత్రిగా పనిచేశా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించా. అరే బిడ్డా.. గుర్తుంచుకో, నీకంటే మాకే ఎక్కువ రాజ్యాంగబద్ధమైన అనుభవం ఉంది” అని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే తాము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. “గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి నడుస్తున్నందునే నియోజకవర్గానికి రూ.1400 కోట్ల నిధులు వచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. అప్పుడు ఎవరైనా అనర్హతకు గురయ్యారా?” అని ప్రశ్నించారు. కేవలం నియోజకవర్గ ప్రయోజనాల కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై కూడా కడియం సెటైర్లు వేశారు. అభివృద్ధిని విస్మరించడం వల్లే ప్రజలు రాజయ్యకు రాజకీయ సమాధి కట్టారని ఎద్దేవా చేశారు. ఇక కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ తన ఫోటోలను ఫ్లెక్సీలలో వాడుకుంటున్నారని, తన ముఖం చూస్తేనే ఓట్లు పడతాయని వారికి అర్థమైందని చురకలు అంటించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *