పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఆవును చంపిన పెద్ద పులి
భిక్కనూరు, ప్రజా జ్యోతి (డిసెంబర్ 16)
కామారెడ్డి జిల్లాలో పెద్దపులి ప్రవేశించి హడలెత్తిస్తోంది. జనం పెద్దపులి సంచారంతో భయకంపితులవుతున్నారు. జిల్లా చరిత్రలోనే సుమారు ఆరు దశబ్దాలుగా పెద్ద పులి ఉనికి లేకపోగా ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగొల్పుతుంది.ఉమ్మడి నిజామాబాదు జిల్లాలోనే లేని పెద్దపులి కామారెడ్డి జిల్లాలోకి ఎలా ప్రవేశించింది అనేది అటవీ అధికారులకు సవాల్ గా మారింది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వు నుండి వందల కిలోమీటర్ల దాటి కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించి ఉంటుందనేది తెలియవచ్చింది.ఇదిలా ఉండగా పెద్దపులి సంచారం కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి తదితర మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కోతులను నివారిస్తామని హామీలిచ్చి గెలిచిన కొత్త సర్పంచులు ఇంకా కొలువుదీరక ముందే పెద్దపులి సంచారం సవాల్ విసురుతోంది. గత మూడు రోజులుగా అంబారీపేట మొదలుకొని సంగమేశ్వర్, కాచాపూర్ గ్రామాల మీదుగా పెద్దమల్లారెడ్డి గ్రామం వరకు సంచరించినట్లు అటవీ అధికారులు చెపుతున్నారు. ఆయా గ్రామాల్లోని పశువుల కొట్టాలపై దాడి చేసి పశువులను చంపుతుంది. దీంతో ప్రజలు బీతావహులవుతున్నారు. తాజాగా పెద్దమల్లారెడ్డి గ్రామాన్ని మంగళవారం అటవీ అధికారులు సందర్శించారు. ఆవు యజమానికి నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయం కింద ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అటవీ సిబ్బంది పులి పాదముద్రలను సేకరించి పెద్దపులిగా నిర్ధారించారు. ఈ సందర్బంగా గ్రామస్తులతో మాట్లాడి ముందు జాగ్రత్తలు తీసుకునే విషయాలపై అవగాహన కల్పించారు.
