- పర్వతగిరి ఎస్సీ కాలనీలో తీవ్రమైన నీటి సమస్యలు
- పట్టించుకోని పంచాయతీ కార్యదర్శిపై కాలనీవాసుల ఆగ్రహం
పర్వతగిరి, నవంబర్ 21 (ప్రజాజ్యోతి):
పర్వతగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత మూడు రోజులుగా వాటర్ ట్యాంకర్ ద్వారా గానీ, మిషన్ భగీరథ పైప్‌లైన్ ద్వారా గానీ మంచినీటి సరఫరా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా నీరు రాకపోవడం వల్ల కుటుంబాలన్నీ ఇరకాటంలో పడ్డాయని కాలనీవాసులు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు సమస్యను తెలియజేసినప్పటికీ, పొంతనలేని సమాధానాలు చెబుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చలికాలంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, రానున్న వేసవిలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే కాలనీలోని మహిళలంతా ఏకమై ధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని వారు హెచ్చరించారు.
