దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.
ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నెమ్మదిగా వెళుతున్న కారులో సోమవారం సాయంత్రం శక్తివంతమైన పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సోమవారం రాత్రి వరకు 9 మంది మరణించగా, 20 మంది గాయపడినట్లు అధికారులు ధ్రువీకరించారు. తాజాగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 12కి పెరిగింది.
ఈ దారుణ ఘటనపై ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ పేలుడు నేపథ్యంలో దేశ రాజధానిలో హైఅలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, కఠిన నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
