భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. అల్లా పేరు మీద అజారుద్దీన్ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర కేబినెట్ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాణస్వీకారం పూర్తయిన అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, నేతలు అజారుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం 12:25 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం కేవలం 9 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. మరోవైపు, అజారుద్దీన్ కు ఏ శాఖ కేటాయిస్తారనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
