తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈవీల వాడకం పెరగాలంటే అందుకు అనుగుణంగా చార్జింగ్ సౌకర్యాలు తప్పనిసరి అని భావించిన అధికారులు, రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు నగరాలు, పట్టణాల్లో అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నారు.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు 3,752 స్థలాలు అనువుగా ఉన్నాయని అధికారులు తేల్చారు. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాలను నాలుగు కేటగిరీలుగా విభజించి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను ‘ఏ’ కేటగిరీగా, నగరాలు, జాతీయ రహదారులను ‘బీ’ కేటగిరీగా, పట్టణాలు, వీధులు, షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్‌లను ‘సీ’ కేటగిరీగా వర్గీకరించారు. బ్యాటరీ స్వాపింగ్ లేదా చార్జింగ్ కేంద్రాలను ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును ‘డీ’ కేటగిరీ కింద పరిగణనలోకి తీసుకున్నారు.
దక్షిణ డిస్కమ్ పరిధిలో గుర్తించిన ప్రాంతాల్లో ఏ కేటగిరీ కింద 1,991, బీ కేటగిరీ కింద 294, సీ కేటగిరీ కింద 1,467 ప్రాంతాలు చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో ఈవీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచి, ప్రజలు ఎలాంటి ఆందోళన లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
