ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ సర్కారుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అలాగే రష్యా చమురు, చమురు సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నారు. ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో రష్యా చమురు సంస్థ లుక్ఆయిల్ అంతర్జాతీయంగా ఉన్న తమ ఆస్తులు విక్రయించే పనిలో నిమగ్నమైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొనుగోలుదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది.
నవంబర్ 21 లోగా ఈ ప్రక్రియ ముగించాలని భావిస్తున్నప్పటికీ, అలా జరగని పక్షంలో అదనపు సమయం కోరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రష్యాకు చెందిన లుక్ఆయిల్ సంస్థకు పదకొండు దేశాల్లో చమురు, గ్యాస్ ప్రాజెక్టులలో వాటాలు ఉన్నాయి. బల్గేరియా, రొమేనియా, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో చమురు శుద్ధి కర్మాగారాలు, ఇతర దేశాల్లో గ్యాస్ స్టేషన్లలో భాగస్వామ్యం ఉంది. మరోవైపు, రాస్‌నెప్ట్ అనే కంపెనీకి జర్మనీలో వాటాలు ఉన్నాయి.
ట్రంప్ ఇటీవల ఈ రెండు కంపెనీలపై ఆంక్షలు విధించారు. దీంతో రష్యా వెలుపల వ్యాపారం ఈ సంస్థలకు కష్టంగా మారి, ఆయా దేశాల్లోని ఆస్తులను విక్రయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
రష్యాకు ప్రధానంగా ఆదాయం చమురు, గ్యాస్ ఎగుమతుల నుంచి వస్తుంది. లుక్ఆయిల్, రాస్‌నెస్ట్ ఈ దేశంలోని అతిపెద్ద చమురు కంపెనీలుగా ఉన్నాయి. ఎగుమతుల్లో దాదాపు సగం వాటా ఈ రెండు కంపెనీలదే. వీటిపై ట్రంప్ అక్టోబర్ 22న ఆంక్షలు విధించారు. దీంతో ఈ కంపెనీల నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాయి.
