కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన బాలిక అత్యాచారం కేసులో నిందితుడు తాటిక నారాయణరావు (62) ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మైనర్ బాలిక అత్యాచారం కేసులో అరెస్టయిన నారాయణరావును తుని రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా, మధ్యలో బహిర్భూమికి వెళ్తానని చెప్పి పట్టణ శివారులోని కోమటి చెరువులో దూకినట్లు పోలీసులు తెలిపారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, చెరువులో నిందితుడి మృతదేహం లభ్యమైంది.
మనవరాలి వయసున్న బాలికపై నారాయణరావు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గురుకుల పాఠశాలలో చదువుతున్న ఆ బాలికకు తినుబండారాలు కొనిపెట్టి మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. తాను ఆమెకు తాతనని పాఠశాల సిబ్బందిని నమ్మబలికాడు.
బాలిక ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్తానంటూ మంగళవారం ఆమెను పాఠశాల నుంచి బయటకు తీసుకెళ్లి, తొండంగి సమీపంలోని తోటలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను ఒకరు వీడియో తీయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిపై దాడి చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే కోర్టుకు తరలిస్తుండగా అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తుని పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది.