శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం స్వామివారిని దర్శించుకున్నారు. తద్వారా, ఈ ప్రఖ్యాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన తొలి మహిళా దేశాధినేతగా ఆమె చరిత్ర సృష్టించారు. గతంలో 1970లలో మాజీ రాష్ట్రపతి వీవీ గిరి శబరిమలను సందర్శించగా, ఆ తర్వాత అయ్యప్పను దర్శించుకున్న రెండో భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు.
కేరళలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆమె శబరిమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు పంబా బేస్ క్యాంపు వద్దకు వచ్చిన ఆమె, మొదట పంపా నదిలో పాదాలను శుభ్రం చేసుకుని, సమీపంలోని గణపతి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం నల్ల చీర ధరించి సంప్రదాయబద్ధంగా ‘కెట్టునిర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆమె ‘ఇరుముడికెట్టు’ను సిద్ధం చేశారు. రాష్ట్రపతితో పాటు ఆమె అల్లుడు గణేష్ చంద్ర హోంబ్రామ్, ఇతర సిబ్బంది కూడా ఇరుముడిని సిద్ధం చేసుకున్నారు.
పంబ నుంచి ప్రత్యేక వాహనంలో సన్నిధానానికి చేరుకున్న రాష్ట్రపతికి ఆలయ తంత్రి కందరారు మహేష్ మోహనారు ‘పూర్ణకుంభ’ స్వాగతం పలికారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ కూడా ఆమెకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ద్రౌపది ముర్ము పవిత్రమైన ఇరుముడిని తలపై పెట్టుకుని, 18 మెట్లను ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆమె ఇరుముడిని ప్రధాన అర్చకులు తీసుకుని పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మాలికాపురం ఆలయాన్ని కూడా ఆమె సందర్శించారు.
రాష్ట్రపతి పర్యటనపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. “ఆమె వయసు 67. ఆమె ఏ నిబంధనలను ఉల్లంఘించలేదు, ఏ విశ్వాసాన్ని గాయపరచలేదు – కేవలం గౌరవించారు. ఇరుముడితో అయ్యప్పను దర్శించుకున్న తొలి రాష్ట్రపతిగా నిలిచారు” అని ఆయన పేర్కొన్నారు. “భక్తి అనేది నిశ్శబ్దంగానే నిలబడుతుందని ఈ పర్యటన గుర్తుచేసింది. కోట్లాది అయ్యప్ప భక్తులను ఏకం చేసే విశ్వాసానికి ఈ క్షణం అద్దం పడుతోంది” అని ఆయన తన పోస్టులో రాశారు.
మహిళల ప్రవేశంపై 2018లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఒక మహిళా దేశాధినేత ఆలయాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా సాధారణ భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారులు తెలిపారు