టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉక్కుపాదం మోపారు. మంగళవారం జోన్ వ్యాప్తంగా నిర్వహించిన మెగా టికెట్ తనిఖీ డ్రైవ్‌లో ఒక్కరోజే ఏకంగా రూ.1.08 కోట్లకు పైగా జరిమానా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. భారతీయ రైల్వే చరిత్రలోనే ఒకేరోజు ఇంత భారీ మొత్తంలో అపరాధ రుసుం వసూలు కావడం ఇదే తొలిసారి.
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆదేశాల మేరకు జోన్ పరిధిలోని ఆరు డివిజన్లలో ఏకకాలంలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, నాందేడ్ డివిజన్ల సిబ్బంది రైళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా, టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్న 16,105 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. వారి నుంచి అపరాధ రుసుం రూపంలో రూ.1.08 కోట్లు రాబట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఇటీవల ఇదే నెల 6వ తేదీన నిర్వహించిన తనిఖీల్లో రూ.92.4 లక్షలు వసూలు కాగా, ఇప్పటివరకు అదే అత్యధికంగా ఉండేది. అయితే, మంగళవారం నాటి వసూళ్లు ఆ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక రోజులో వసూలైన అత్యధిక జరిమానాగా నిలవడం గమనార్హం.
డివిజన్ల వారీగా చూస్తే, విజయవాడ డివిజన్‌లో అత్యధికంగా రూ.36.91 లక్షలు వసూలు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో గుంతకల్లు (రూ.28 లక్షలు), సికింద్రాబాద్ (రూ.27.9 లక్షలు) డివిజన్లు ఉన్నాయి. గుంటూరులో రూ.6.46 లక్షలు, హైదరాబాద్‌లో రూ.4.6 లక్షలు, నాందేడ్ డివిజన్‌లో రూ.4.08 లక్షల చొప్పున జరిమానాలు విధించారు.