ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుమ్లా జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఇద్దరు కీలక సబ్-జోనల్ కమాండర్లు ఉండటం గమనార్హం. వీరిద్దరి తలలపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బిషున్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేచ్కీ దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నిషేధిత ఝార్ఖండ్ జన్ ముక్తి పరిషద్ (జేజేఎంపీ) సంస్థకు చెందిన మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరపగా, పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు ప్రారంభించారు.
ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను సబ్-జోనల్ కమాండర్లు లాలూ లోహ్రా, ఛోటూ ఓరాన్‌తో పాటు మరో క్రియాశీలక సభ్యుడు సుజీత్ ఓరాన్‌గా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి కీలక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. లాలూ లోహ్రా వద్ద ఏకే-47 రైఫిల్‌తో పాటు మరిన్ని తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సమీప అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ నెలలో మావోయిస్టులపై జరిగిన నాలుగో ఆపరేషన్ ఇది. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2025లో ఇప్పటివరకు మొత్తం 32 మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్లు ఝార్ఖండ్ పోలీస్ శాఖ వెల్లడించింది. మార్చి 2026 నాటికి రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర పారామిలటరీ బలగాల సహకారంతో ప్రత్యేక ఆపరేషన్లను ముమ్మరం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు