దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆశ్రమంలో జరిగిన దారుణం వెలుగు చూసింది. పేద విద్యార్థినులకు విద్యాదానం చేయాల్సిన ఓ స్వామీజీనే వారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి తమను లైంగికంగా వేధించాడంటూ 17 మంది విద్యార్థినులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఇనిస్టిట్యూట్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాలో స్కాలర్‌షిప్‌తో పోస్ట్-గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ కోర్సులు చదువుతున్న విద్యార్థినులను స్వామి చైతన్యానంద లక్ష్యంగా చేసుకున్నారు. అసభ్యకరమైన భాష వాడటం, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, బలవంతంగా తాకడం వంటి చర్యలకు పాల్పడ్డారని బాధితులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. స్వామి డిమాండ్లకు ఒప్పుకోవాలంటూ కొందరు వార్డెన్లు, మహిళా సిబ్బంది కూడా తమపై ఒత్తిడి తెచ్చారని వారు ఆరోపించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సౌత్-వెస్ట్ జిల్లా డీసీపీ అమిత్ గోయల్ మాట్లాడుతూ స్వామి చైతన్యానందపై లైంగిక వేధింపులతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే, విషయం బయటకు పొక్కడంతో నిందితుడు పరారయ్యాడు. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. చివరిసారిగా ఆగ్రా సమీపంలో అతని కదలికలను గుర్తించినట్లు సమాచారం.
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇనిస్టిట్యూట్ బేస్‌మెంట్‌లో నిందితుడు ఉపయోగించిన వోల్వో కారును గుర్తించారు. ఆ కారుకు నకిలీ డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్ (39 యూఎన్ 1) ఉన్నట్లు తేలడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సంబంధాలు తెంచుకున్న శృంగేరి పీఠం
ఈ ఆశ్రమం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శృంగేరి శ్రీ శారదా పీఠానికి చెందిన శాఖ కావడంతో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆరోపణలు వెల్లువెత్తడంతో శృంగేరి పీఠం వెంటనే స్పందించింది. స్వామి చైతన్యానంద చర్యలు చట్టవిరుద్ధమని, పీఠం నియమాలకు వ్యతిరేకమని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. అతడిని పదవి నుంచి తొలగించడమే కాకుండా, పీఠంతో అతనికి ఉన్న అన్ని సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్లు స్పష్టం చేసింది.