హైదరాబాద్ నగర రోడ్లపై తిరిగే పోలీసు వాహనాల రూపురేఖలు మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంక్షిప్త నామాన్ని ‘టీఎస్’ నుంచి ‘టీజీ’గా మార్చిన నేపథ్యంలో, హైదరాబాద్ పోలీసులు తమ వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా, కొత్త ‘టీజీ’ నెంబర్ ప్లేట్లతో కూడిన 134 పెట్రోలింగ్ వాహనాలను ఆదివారం తిరిగి విధుల్లోకి ప్రవేశపెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచనలతో ఈ మార్పులు జరుగుతున్నాయి. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏఆర్) హెడ్‌క్వార్టర్స్ అధికారులు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 188 ప్రభుత్వ వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్లు అమర్చడంతో పాటు, వాటికి అవసరమైన మరమ్మతులు కూడా చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పాత ప్లేట్లను తొలగించడం, బంపర్లు, డోర్లకు పెయింటింగ్, ఇంజిన్ రిపేర్లు, ఇతర పనుల కోసం సుమారు రూ. 1.6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీఏఆర్) తెలిపారు.
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అత్యవసర సమయాల్లో తక్షణ స్పందన వంటి కీలక విధుల్లో ఈ వాహనాలు పాలుపంచుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. తొలి దశలో పెట్రోలింగ్ వాహనాల ప్రక్రియ పూర్తి కాగా, త్వరలోనే ట్రాఫిక్ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్, పైలట్, ఇంటర్‌సెప్టర్ వాహనాలకు కూడా ‘టీజీ’ నెంబర్ ప్లేట్లను అమర్చనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వాహనాలను ఎల్లప్పుడూ శుభ్రంగా, మంచి కండిషన్‌లో ఉంచుకోవాలని డ్రైవర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, 2024 ఫిబ్రవరిలో రాష్ట్ర సంక్షిప్త నామాన్ని మార్చాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం ఎలాంటి నియమాలు పాటించకుండా ‘టీఎస్’ను ఎంచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా వాహన రిజిస్ట్రేషన్ల కోసం ‘టీజీ’ కోడ్‌ను అధికారికంగా ప్రకటించడంతో, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో ఈ మార్పును అమలు చేస్తున్నారు.