తాను పార్టీ మారుతున్నట్లు, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ ఊహాగానాలన్నింటినీ ఆయన తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలని, ప్రజలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, తనపై సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కనందుకే తాను అసంతృప్తితో ఉన్నానని, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. “కొంతమంది గిట్టని వ్యక్తులు నా ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు, పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను” అని ఆయన తెలిపారు.
తమది కాంగ్రెస్ కుటుంబమని, రెండుసార్లు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు ఎంతో అభిమానమని, వారి నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని పునరుద్ఘాటించారు. ఇలాంటి నిరాధారమైన ప్రచారాలను నమ్మి గందరగోళానికి గురికావొద్దని తెలంగాణ ప్రజలను కోరారు.
