ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మైదానం బయట తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవేళ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధిస్తే.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్‌గా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహసిన్ నఖ్వీ చేతుల మీదుగా తాను ట్రోఫీని అందుకోబోనని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఏసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ అనూహ్య పరిణామం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.
ఆదివారం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం (షేక్ హ్యాండ్) చేసుకోకూడదని అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడంతో ఈ వివాదం మొదలైంది. ముందుగా సమాచారం ఇవ్వకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పీసీబీ ఛైర్మన్ మోహసిన్ నఖ్వీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అవమానం తర్వాత టోర్నీ నుంచి వైదొలుగుతామనే స్థాయికి పాకిస్థాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి సున్నితమైన విషయాలను ముందుగానే చర్చించి నిర్ణయించాలని, మైదానంలో ఇబ్బందికర పరిస్థితులు సృష్టించవద్దని పీసీబీ డిమాండ్ చేస్తోంది.
ఈ వివాదం నేపథ్యంలో పీసీబీ కొన్ని డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచింది. తమ మ్యాచ్‌లకు రెఫరీగా ఉన్న అండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని కోరింది. దీనికి ఐసీసీ పాక్షికంగా అంగీకరించింది. యూఏఈతో జరగనున్న పాకిస్థాన్ మ్యాచ్‌కు పైక్రాఫ్ట్ స్థానంలో రిచీ రిచర్డ్‌సన్‌ను నియమించింది. అయితే, టోర్నీలోని తదుపరి మ్యాచ్‌లకు పైక్రాఫ్ట్ కొనసాగింపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుతానికి పాకిస్థాన్ టోర్నీలో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, తమ ఆందోళనలను మరోసారి గట్టిగా వినిపించాలని నఖ్వీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల బోర్డులు తమ తమ అభ్యంతరాలను ఏసీసీకి నివేదించడంతో, టోర్నీ భవిష్యత్తుపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది.