-
దామెర / ప్రజాజ్యోతి:
- రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి ఇక జీవితం అయిపోయిందని తీవ్ర ఆందోళనకు గురైన ఆ విద్యార్థికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన ప్రోత్సాహంతో కొత్త ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రి చూపించిన దాతృత్వానికి ఆ విద్యార్థి, అతనితో పాటు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
❇️ హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్ జీవితంలో ఐఐటీ సాధించాలన్న పట్టుదలతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2024 నవంబర్ 2 న రాజస్థాన్ కోటాలో శిక్షణ కోసం రైలులో ప్రయాణిస్తున్న సందర్భంలో గుర్తుతెలియని దుండగులు ఆ విద్యార్థిపై దాడి చేసి రైలు నుంచి బయటకు తోసేశారు. ఈ ఘటనలో విద్యార్థి తన రెండు కాళ్లను పూర్తిగా కోల్పోయాడు.
❇️ ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో స్పందించి, ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ విద్యార్థికి అత్యంత అధునాతన కృత్రిమ కాళ్లను అమర్చే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
❇️ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాహుల్‌ను నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు 10 లక్షలకు పైగా వెచ్చించి ఆ యువకుడికి ఆధునిక కృత్రిమ కాళ్లను అమర్చారు. కొద్ది రోజులుగా ఒక్కో అడుగు వేస్తూ నడవడం ప్రారంభించిన రాహుల్ ఇప్పుడు సంపూర్ణంగా కోలుకుని ఆత్మ విశ్వాసంతో నడవగలుగుతున్నాడు.
❇️ రెండు కాళ్లు కోల్పోయిన తనకు మళ్లీ నడవగలిగే విధంగా అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించిన ముఖ్యమంత్రి కి రాహుల్ కుటుంబ సభ్యులతో కలిసివచ్చి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రాహుల్ భుజం తట్టి భవిష్యత్తులో బాగా చదువుకుని రాణించాలని ప్రోత్సహించారు.
Great