కోలీవుడ్ లో ఈ మధ్య కాలంలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాల హవా కొనసాగుతోంది. ఈ జోరును కొనసాగిస్తూ వచ్చిన సినిమానే ‘ఇంద్ర’. శబరీశ్ నంద దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, వసంత్ రవి .. మెహ్రీన్ .. అనికా సురేంద్రన్ .. సునీల్ ప్రధానమైన పాత్రలను పోషించారు. వసంత్ రవి అంటే ఎవరో కాదు, ‘జైలర్’ సినిమాలో రజనీ కొడుకు పాత్రను పోషించిన ఆర్టిస్ట్.
ఈ మధ్య కాలంలో విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళుతున్న సునీల్, ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను చేశాడు. ఆయన పాత్రకి మంచి అప్లాజ్ వచ్చింది కూడా. ఆగస్టు 22వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. సన్ నెక్స్ట్ – టెంట్ కొట్టా ఓటీటీలలో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అజ్మల్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
కథ విషయానికి వస్తే, హీరో ఒక పోలీస్ ఆఫీసర్. ఊహించని ఒక సంఘటన కారణంగా అతను సస్పెండ్ అవుతాడు .. అదే సమయంలో అతని చూపు పోతుంది. అలా భారంగానే రోజులు నెట్టుకొస్తూ ఉండగా, భార్య హత్య చేయబడుతుంది. ఆ కేసు అనేక విధాలుగా మలుపులు తీసుకుంటూ ఉండటంతో, అంధుడైన ఆ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ చూపు ఎలా పోయింది? అతని భార్యను హత్య చేసింది ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? అనేది కథ.