రాత్రి 11 గంటల నుండి లైన్లో ఉన్న దొరకని యూరియా బస్తాలు..

Warangal Bureau
1 Min Read
  • రాత్రి 11 గంటల నుండి లైన్లో ఉన్న దొరకని యూరియా బస్తాలు.
  • కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్న రైతులు.

నల్లబెల్లి /సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి ):

 

 నల్లబెల్లి మండలం మేడపల్లి రాంపూర్ రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తా కోసం సోమవారం రాత్రి 11 గంటల నుంచే లైన్లో నిలబడి వేచి ఉన్న రైతులకు మంగళవారం ఉదయం కల్లా నిరాశ మాత్రమే మిగిలింది. చాలామంది రైతులు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది.ప్రభుత్వం యూరియా కొరత లేదని, వరుసగా వ్యాగన్లు వస్తున్నాయని చెబుతున్నా, ఆ వాగ్దానాలు రైతులకు అందడం లేదు. రోజురోజుకీ పంటను వదులుకోలేక రాత్రింబగళ్లు లైన్లో నిలబడే రైతులకు ఒక్క బస్తా కూడా దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా మళ్లీ వచ్చే వరకు దాదాపు వారం నుంచి పది రోజులు పడుతుందని అధికారులు చెబుతుండటంతో రైతుల కలవరం మరింత పెరిగింది.

ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు ఈ సమస్యపై సమీక్షలు జరపకుండా గాలికే వదిలేయడం రైతులను మరింత మానసికంగా కుంగదీసిందని వారు ఆరోపించారు. యూరియా కోసం రాత్రి నుంచి కట్టుదిట్టంగా నిలబడి ఉన్న రైతులు చివరికి తోపులాటలకు దిగే పరిస్థితి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ఇదేనా ప్రజా పాలన మార్పు? మార్పు అంటే ఇదేనా?” అని ప్రశ్నిస్తూ, రైతుల తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *