గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. నేటి సాయంత్రం వరకు నగర వ్యాప్తంగా మొత్తం 2,32,520 గణపతి విగ్రహాల నిమజ్జనం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జన కేంద్రాల వద్ద భక్తులు గణనాథులకు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలుకుతున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. అన్ని నిమజ్జన పాయింట్ల వద్ద విగ్రహాలను సురక్షితంగా గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
జోన్ల వారీగా చూస్తే ఎల్బీనగర్ ప్రాంతంలో 34,287, చార్మినార్ (18,791), ఖైరతాబాద్ (50,203), శేరిలింగంపల్లి (38,136), కూకట్‌పల్లి (58,847), సికింద్రాబాద్ (32,256) విగ్రహాలు నిమజ్జనం చేశారు. నగరంలో మొత్తం 2,32,520 విగ్రహాలు నిమజ్జనం చేయగా, అందులో 3 అడుగుల కంటే తక్కువగా ఉన్నవి 84,993… 3 అడుగుల కంటే ఎక్కువగా ఉన్నవి 1,47,527 ఉన్నాయి.