ఏపీలో పశుసంవర్ధక రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోందని, సుమారు 25 లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీ. దామోదర్ నాయుడు వెల్లడించారు. కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో నిన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) పశుసంపద రంగం వాటా 12.17 శాతంగా ఉందని, దీని ద్వారా ఏకంగా రూ.1.61 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతోందని దామోదర్ నాయుడు వివరించారు. కేవలం కోడిగుడ్ల ఉత్పత్తిలోనే కాకుండా, గొర్రెలు, కోళ్ల ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో, మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో, పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో, గేదెల పెంపకంలో ఆరో స్థానంలో రాష్ట్రం నిలిచిందని ఆయన తెలిపారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ సున్నాగా ఉండటం పౌల్ట్రీ రంగానికి మరింత ఊతమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కూటమి ప్రభుత్వం పశుసంవర్ధక రంగంలో 15 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా నిర్దేశించుకుందని డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా పశుపోషకులకు అండగా నిలిచేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పశువుల దాణాపై 50 శాతం, పశుగ్రాస విత్తనాలపై 75 శాతం, పశువుల బీమాపై 85 శాతం రాయితీ అందిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు గోకులాల నిర్మాణం కోసం 70 నుంచి 90 శాతం, బహువార్షిక పశుగ్రాసాల సాగుకు 100 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ మీడియా సమావేశంలో పౌల్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు సోమిరెడ్డి, ఉపాధ్యక్షుడు కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.