చైనాలో ఇటీవల జరిగిన షాంఘై కో ఆపరేషన్ సదస్సుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటో ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకుపుట్టించేలా ఉందని అమెరికా రాజకీయ విశ్లేషకుడు వాన్ జోన్స్ పేర్కొన్నారు. ప్రపంచంపై ఆసియా ఆధిపత్యం చెలాయించనుందని చెప్పేందుకు ఇది సంకేతంలా కనిపిస్తోందన్నారు.
షాంఘై సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ నవ్వుతూ మాట్లాడుకోవడం మీడియా కెమెరాలు బంధించాయి. ఈ ముగ్గురు నేతలూ నవ్వుతూ చేతిలో చేయి వేసుకుని మాట్లాడుకోవడం అమెరికన్లను వణికించేలా ఉందని వాన్ జోన్స్ వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాధిత దేశాధినేతలు ఒకే వేదికపై నవ్వులు పంచుకుని, పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న ఫోటోలు పశ్చిమ మీడియా దృష్టిని ఆకర్షించాయి. దీనిపై వాన్ జోన్స్ సీఎన్ఎన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ఈ రోజును చారిత్రాత్మకంగా, అతిపెద్ద మలుపుగా గుర్తుంచుకుంటాం.. ఎందుకంటే, అమెరికా సుంకాల బాధిత దేశాల్లో మూడు కీలక దేశాల అధినేతలు నవ్వుతూ మాట్లాడుకోవడం వారి మధ్య మైత్రి బలపడుతోందనేందుకు సంకేతం. ఇది అమెరికాకు మంచిది కాదు. ఈ సమావేశం ‘నూతన ప్రపంచ వ్యవస్థ’ కు సంకేతం. ఒకప్పుడు ఇలా అమెరికా, చైనా, రష్యా మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనం అందులో లేము.. అందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నారు’’ అని ఆయన అన్నారు.
పాశ్చాత్య మీడియాలో ఈ ఫొటో సంచలనంగా మారింది. అమెరికా వ్యతిరేక వర్గంగా ముద్రపడిన నాలుగు దేశాలు ఇరాన్, ఉత్తర కొరియా, చైనా, రష్యాల మొదటి సమావేశంగా విశ్లేషకులు అభిప్రాయపడినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ‘ఈ ఫొటో జిన్‌పింగ్, పుతిన్ మధ్య ఉన్న స్నేహం అమెరికాను సవాలు చేసేలా ఉంది. సుంకాలతో ట్రంప్ భారత్ ను దూరం చేసుకోగా.. భారత దేశం చైనాకు దగ్గరవుతోంది’ అని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది.