తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన సినీ ప్రముఖులు

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. సినీ పరిశ్రమ కార్మికుల సమ్మె కారణంగా ఇటీవల దాదాపు రెండు వారాలకు పైగా షూటింగ్‌లు నిలిచిపోయిన విషయం విదితమే. ఈ క్రమంలో పలు సినిమాల నిర్మాణాలు ఆగిపోవడంతో సినిమాల విడుదలలు కూడా వాయిదా పడ్డాయి. సినీ పరిశ్రమలోని పెద్దలు, నిర్మాతలు, సంబంధిత యూనియన్ నేతల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమ్మె రెండు వారాలకు పైగా కొనసాగింది.

ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడం, ఆయన సూచనలతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపి కార్మికుల సమ్మె విరమణకు చర్యలు తీసుకోవడంతో పరిశ్రమకు భారీ ఊరట లభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతల సంఘం ప్రతినిధులు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమలో తరచూ తలెత్తుతున్న వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పరిశ్రమ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఒక సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఒక ఉమ్మడి విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపిన వారిలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, జెమినీ కిరణ్, శ్రవంతి రవికిషోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డీవీవీ దానయ్య, చెరుకూరి సుధాకర్, అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులు ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *