పంజాబ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఓ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్, ట్రక్కు ఢీ కొన్నాయి. దీంతో గ్యాస్ ట్యాంకర్ పేలిపోయింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఆదివారానికి మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గాయాలపాలైన మరో పదిహేను మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హోషియార్‌పూర్ జిల్లాలోని మండియాలాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంపై డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్ స్పందిస్తూ.. ప్రమాద సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందించామన్నారు. ఘటనాస్థలానికి అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు మరియు పంజాబ్ పోలీసులు చేరుకుని బాధితులకు సాయం అందించారు. గాయపడిన వారిని అంబులెన్స్ లలో సమీప ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. ట్రక్కును ఢీ కొట్టడంతో ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అయిందని, దీంతో పేలుడు సంభవించిందని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పంజాబ్ మంత్రి రవ్‌జోత్ సింగ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు