కూలీ’-మూవీ రివ్యూ

V. Sai Krishna Reddy
4 Min Read

రజనీ మార్క్ సినిమాగా ‘కూలీ’

లోకేశ్ కనగరాజ్ మార్క్ యాక్షన్

సౌబిన్ షాహిర్ పాత్ర హైలైట్

అడుగడుగునా థ్రిల్ చేసే ట్విస్టులు

 

ఆకట్టుకునే నేపథ్య సంగీతం

అక్కడక్కడా సాగదీసిన సందర్భాలు

 

రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ రూపొందించిన సినిమానే ‘కూలీ’. నాగార్జున .. శృతి హాసన్ .. సౌబిన్ షాహిర్ .. సత్యరాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ఆ అంచనాలను అందుకోగలిగిందా లేదా? అనేది చూద్దాం.

కథ: దేవా (రజనీకాంత్) ఓ మాన్షన్ నడుపుతూ, అందులోనే ఒక రూమ్ లో ఉంటూ ఉంటాడు. తన స్నేహితుడైన రాజశేఖర్ (సత్యరాజ్) చనిపోయాడని తెలిసి అతని ఇంటికి వెళతాడు. రాజశేఖర్ కి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కూతురు ప్రీతి (శృతి హాసన్), దేవా పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తుంది. రాజశేఖర్ పొందినది సహజ మరణం కాదనీ, అతను హత్య చేయబడ్డాడని ఆమెతో దేవా అంటాడు. హంతకులను తాను వదలనని తేల్చి చెబుతాడు.

ఇదిలా ఉండగా, సైమన్ (నాగార్జున) ఎక్స్ పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. వందలమంది కార్మికులు ఆ సంస్థలో పనిచేస్తూ ఉంటారు. సైమన్ కి కుడి భుజంగా దయాళ్ (సౌబిన్ షాహిర్) ఉంటాడు. అతని కనుసన్నలలోనే మిగతా కూలీలంతా పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి కొంతమంది పోలీసులు కూడా కూలీలుగా చేరతారు. ఆ విషయాన్ని గ్రహించిన దయాళ్ ఒక్కో పోలీస్ ను కనిపెట్టి దారుణంగా చంపుతూ ఉంటాడు.

చనిపోవడానికి ముందు రాజశేఖర్, సైమన్ ను .. అతని అనుచరుడైన దయాళ్ ను కలిసినట్టుగా దేవాకి తెలుస్తుంది. దాంతో రాజశేఖర్ చనిపోవడానికి గల కారణాన్ని .. సైమన్ సామ్రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దేవా అక్కడికి వెళతాడు. దేవా గతం ఏమిటి? సైమన్ స్థావరంలో ఏం జరుగుతోంది? ఆ మిస్టరీని దేవా ఎలా ఛేదిస్తాడు? ఆ ప్రయత్నంలో అతనికి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అనేది మిగతా కథ.

విశ్లేషణ: లోకేశ్ కనగరాజ్ అల్లుకున్న ఈ కథ, యాక్షన్ ను .. ఎమోషన్ ను .. రజనీ స్టైల్ ను కలుపుకుంటూ ముందుకు వెళుతుంది. ఈ సినిమాలో హీరో రజనీ కాంత్ .. విలన్ నాగార్జున. ఈ ఇద్దరి చుట్టూనే కథ తిరుగుతుందని ప్రేక్షకులు అనుకోవడం సహజం. కానీ ఈ ఇద్దరితో పాటు ఈ కథను సమాంతరంగా నడిపించిన పాత్ర మరొకటి ఉంది. ఆ పాత్రలో కనిపించినదే సౌబిన్ షాహిర్. ఈ పాత్రను మలిచిన విధానంలోనే లోకేశ్ ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు.

సాధారణంగా హీరోను విలన్ టెన్షన్ పెట్టడం .. విలన్ ను హీరో ఇబ్బందుల్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒకరికొకరు అడ్డంకులను .. అవాంతరాలను సృష్టిస్తూ ఉంటారు. అయితే ఈ సినిమాలో అటు హీరోను .. ఇటు విలన్ ను సౌబిన్ షాహిర్ పోషించిన దయాళ్ పాత్ర ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది. అది కూడా కామెడీగా కాదు .. చాలా సీరియస్ గా. ఈ కథకి ఇదే బలం .. ఈ అంశమే ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు.

లోకేశ్ కనగరాజ్ తయారు చేసుకున్న కథ మాత్రమే కాదు, స్క్రీన్ ప్లే కూడా మంచి పట్టు మీద కనిపిస్తుంది. ఇక ట్విస్టులపై ట్విస్టులు ఆడియన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆడియన్స్ నుంచి విజిల్స్ ను రాబట్టే ట్విస్టులు చాలానే కనిపిస్తాయి. రజనీ స్టైల్ .. నాగ్ విలనిజం .. సౌబిన్ షాహిర్ పోషించిన విలక్షణమైన పాత్ర ఈ సినిమాకి ప్రధానమైన బలం అనే చెప్పాలి. చివర్లో వచ్చే సన్నివేశాలు సీక్వెల్ కోసమని సరిపెట్టుకుంటే, ఈ సినిమా మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేస్తుందనడంలో సందేహం లేదు.

పనితీరు: లోకేశ్ కనగరాజ్ కి మాస్ యాక్షన్ కథలపై మంచి పట్టు ఉంది. అదే విషయాన్ని ఆయన మరోసారి నిరూపించుకున్నాడు. ప్రధానమైన పాత్రలను ఆయన డిజైన్ చేసిన తీరు బాగుంది. హీరోయిన్ లేదు .. లవ్ లేదు .. డ్యూయెట్లు లేవు అనే ఆలోచన రాకుండా ప్రేక్షకులను మెప్పించడంలో కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. అక్కడక్కడా సాగదీసిన సందర్భాలైతే ఉన్నాయి.

రజనీ తన మార్క్ స్టైల్ తో మరోసారి మెస్మరైజ్ చేశారు. విలన్ గా నాగ్ మెప్పించారు. తనకి లభించిన ఈ అరుదైన అవకాశాన్ని సౌబిన్ షాహిర్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. శృతిహాసన్ అందంగా మెరిసింది. పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ పాటలో ఆమె చాలా నాజూకుగా విరిసింది. సందర్భానికి తగినట్టుగానే అమీర్ ఖాన్ .. ఉపేంద్ర ఎంట్రీ పడింది. గిరీశ్ గంగాధరన్ ఫొటోగ్రఫీ .. ఫిలోమిన్ రాజు ఎడిటింగ్ ఓకే. సంగీత దర్శకుడిగా అనిరుధ్ మాత్రం మరోసారి చెలరేగిపోయాడు.

ముగింపు: ఇది రజనీ మార్క్ కంటెంట్ .. లోకేశ్ మార్క్ కాన్సెప్ట్ అని చెప్పాలి. నాగ్ విలనిజం .. సౌబిన్ షాహిర్ నెగెటివ్ రోల్ ఈ సినిమాకి కొత్తదనాన్ని తెచ్చాయని అనాలి. కథాకథనాలు .. ట్విస్టులు .. ప్రధానమైన పాత్రలను మలచిన విధానం .. నేపథ్య సంగీతం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. చివర్లో వచ్చే సీన్స్ .. సీక్వెల్ కోసమని సర్దుకుంటే, మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *