అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు విధించిన భారీ టారిఫ్ ల విషయంలో, చైనా అనూహ్యంగా మన దేశానికి మద్దతుగా నిలిచింది. అమెరికా వైఖరిని చైనా ప్రభుత్వ నియంత్రణలోని మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ తీవ్రంగా తప్పుబట్టింది. భారత్‌ను అమెరికా ఎన్నడూ సమాన భాగస్వామిగా పరిగణించలేదని, తన ప్రయోజనాల కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తోందని విమర్శిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా 50 శాతం కఠిన సుంకాలను విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ చర్య వెనుక అసలు కారణం అది కాదని, భారత్ స్వతంత్రంగా వ్యవహరించడాన్ని అమెరికా సహించలేకపోవడమేనని ‘గ్లోబల్ టైమ్స్’ ఆరోపించింది. “అమెరికాకు అనుకూలంగా ఉన్నంతవరకే భారత్‌ను మిత్రదేశంగా చూస్తారు. భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం శత్రువుగా పరిగణిస్తారు” అని ఆ కథనంలో పేర్కొంది.
భారత్ ఒకవైపు బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటి కూటముల్లో ఉంటూ బహుళ ధ్రువ ప్రపంచాన్ని కోరుకుంటోందని, మరోవైపు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన ‘క్వాడ్’లోనూ భాగస్వామిగా ఉందని పత్రిక గుర్తుచేసింది. అయినప్పటికీ, అమెరికా తన ఆధిపత్య ధోరణితో ప్రచ్ఛన్న యుద్ధం నాటి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో తటస్థంగా ఉండటాన్ని కూడా అమెరికా తప్పుగా చూస్తోందని మండిపడింది.
ఈ తాజా పరిణామాల నేపథ్యంలో, భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని స్థిరంగా కొనసాగించాలని ‘గ్లోబల్ టైమ్స్’ సూచించింది. పరస్పర గౌరవం, సహకారం ప్రాతిపదికన అంతర్జాతీయ సంబంధాలను నిర్మించుకోవాలని హితవు పలికింది. ఈ వివాదం భారత్-అమెరికా సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది