అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వైద్యుడు వెల్లడించారు. 78 ఏళ్ల వయసులో ఉన్న ట్రంప్ తాజాగా వార్షిక వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
మేరీలాండ్‌లోని వాల్టర్ రీడ్ జాతీయ సైనిక వైద్య కేంద్రంలో ట్రంప్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను శ్వేతసౌధం విడుదల చేసింది. అధ్యక్షుడిగా, కమాండర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించడానికి ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని నేవీ కెప్టెన్ డాక్టర్ షాన్ బార్బబెల్లా తెలిపారు. ట్రంప్ చురుకైన జీవనశైలి ఆయన ఆరోగ్యానికి దోహదం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా 2020లో నిర్వహించిన వైద్య పరీక్షలతో పోలిస్తే ట్రంప్ 20 పౌన్లు బరువు తగ్గినట్లు వైద్యుడు తెలిపారు. గతంలో 244 పౌన్లుగా ఉన్న ఆయన బరువు ప్రస్తుతం 224 పౌన్లకు తగ్గిందని నివేదికలో వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్ తరచూ సమావేశాలు, బహిరంగ ప్రదర్శనలు, గోల్ఫ్ ఈవెంట్‌లలో పాల్గొంటారని ఆయన వైద్యుడు తెలిపారు. జూన్ 14న ట్రంప్ 79వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.