దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా టారిఫ్ విధిస్తామంటూ చేసిన హెచ్చరికలు, దానికి భారత్ గట్టిగా బదులివ్వడం వంటి అంతర్జాతీయ పరిణామాలతో పాటు, రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. ఈ రెండు ప్రధాన కారణాలతో మార్కెట్లు రోజంతా ఒడుదొడుకులకు లోనై చివరికి నష్టాలతో ముగిశాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 308.47 పాయింట్లు (0.38 శాతం) నష్టపోయి 80,710.25 వద్ద స్థిరపడింది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 73 పాయింట్లు (0.30 శాతం) కోల్పోయి 24,649.55 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ, దేశీయ ఒత్తిళ్లు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని సంకేతాలివ్వడంతో మార్కెట్లలో భయాందోళనలు నెలకొన్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి చేయవచ్చని, దీనివల్ల దిగుమతుల బిల్లు పెరిగిపోతుందన్న ఆందోళనలతో రూపాయి విలువ కూడా పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 87.80 వద్ద బలహీనంగా ట్రేడ్ అయింది. అయితే, ముడి చమురు కొనుగోళ్లపై భారత విదేశాంగ శాఖ తన వైఖరిని స్పష్టం చేయడంతో రూపాయి కొంతమేర కోలుకుంది.
మరోవైపు, బుధవారం నాడు ఆర్‌బీఐ మానిటరీ పాలసీని ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో సెకండ్ హాఫ్‌లో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.
రంగాల వారీగా మిశ్రమ ఫలితాలు
ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలు మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్ 0.47 శాతం, నిఫ్టీ ఐటీ 0.48 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.39 శాతం, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 405 పాయింట్లు నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, నిర్మాణ రంగాల్లో కూడా బలహీనత కనిపించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బీఈఎల్ వంటి ప్రధాన షేర్లు నష్టపోగా.. టైటాన్, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా షేర్లు లాభాలతో ముగిశాయి.