డ్రాగన్ కంట్రీ చైనాను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు వణికిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలా చోట్ల భారీ వరదలు పోటెత్తాయి. దాంతో భారీ మొత్తంలో ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. కాగా, షాంగ్జీ ప్రావిన్స్‌లో వరదల కారణంగా ఓ జ్యువెలరీ షాపు నుంచి బంగారం, వెండి నగలు కొట్టుకుపోయాయి. దీంతో వాటిని వెతికేందుకు వీధుల్లో స్థానికులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
షాంగ్జీ ప్రావిన్స్‌లోని ఉచి కౌంటీలో ఈ నెల 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ లావోఫెంగ్జియాంగ్ నగల షాపును సిబ్బంది ఎప్పటిలాగే ఉదయం తెరిచారు. అయితే, అప్పటికే భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా జలమయమైంది. చూస్తుండగానే వరద నీరు దుకాణంలోకి చొచ్చుకువచ్చింది. వరద ఉద్ధృతి పెరగడంతో కళ్లముందే షాపులోని ఆభరణాలు, సేఫ్ బాక్స్ కొట్టుకుపోయాయి.
కొట్టుకుపోయిన వాటిలో దాదాపు 20 కిలోల బంగారం, భారీ మొత్తంలో నగదు గల్లంతైనట్లు యజమాని తెలిపారు. వాటి విలుల పది మిలియన్ యువాన్లు (సుమారు రూ. 12కోట్లు) ఉంటుందని చెప్పారు. ఇక, బంగారం, వెండి ఆభరణాలు కోట్టుకుపోయిన విషయం తెలిసిన స్థానికులు పెద్దఎత్తున వీధుల్లోకి చేరి వెతకడం ప్రారంభించారు. కొందరు తమకు దొరికిన ఆభరణాలను దుకాణం యజమానికి తిరిగి ఇచ్చినట్లు సమాచారం. అలా ఇప్పటి వరకు కిలో బంగారం తమ వద్దకు చేరిందని ఓనర్ వెల్లడించారు. రోజులు గడుస్తున్నా మిగతా బంగారం కోసం స్థానికులు వెతుకుతూనే ఉన్నారు. వాటి తాలూకు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి