ఫార్చ్యూన్ 2025 గ్లోబల్ 500 జాబితాలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) భారతీయ కార్పొరేట్లలో నంబర్ వన్ ర్యాంక్‌ను నిలుపుకుంది. అంతర్జాతీయంగా చూస్తే 88వ ర్యాంకును పొందింది.ఆర్ఐఎల్ గత నాలుగేళ్లలో 67 స్థానాలు ఎగబాకింది. ఇది 2021లో 155వ స్థానంలో ఉండేది. ఆర్ఐఎల్ గత 22 సంవత్సరాలుగా ఫార్చ్యూన్ గ్లోబల్ జాబితాలో కొనసాగుతూ వస్తోంది. కాగా, ఈ ఏడాది భారతదేశం నుంచి తొమ్మిది కంపెనీలు ఫార్చ్యూన్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
అందులో ఐదు ప్రభుత్వ, నాలుగు ప్రైవేటు రంగ కంపెనీలు ఉన్నాయి. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆయా కంపెనీల మొత్తం ఆదాయాల ఆధారంగా ఫార్చ్యూన్ ఈ ర్యాంకులను ఇచ్చింది. ఆర్ఐఎల్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.1,071,174 కోట్ల రికార్డు స్థాయిలో ఏకీకృత స్థూల ఆదాయాన్ని నమోదు చేసింది.
ఇది గత ఏడాదితో పోలిస్తే 7.1 శాతం అధికం. ఇది గత ఏడాదితో కంటే 2.9 శాతం పెరిగి రూ.183,422 కోట్ల ఎబిట్‌డాను సాధించింది. ఇందులో ఆయిల్ టు కెమికల్, ఆయిల్ అండ్ గ్యాస్, రిటైల్, డిజిటల్ సేవల వ్యాపారాలు వృద్ధిని నమోదు చేశాయి.