ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. మృతులపై మొత్తం రూ. 17 లక్షల రివార్డు ఉంది.
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ దళాలు బాసగూడ, గంగలూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని దక్షిణ-పశ్చిమ కారిడార్‌లో మావోయిస్టుల కార్యకలాపాలపై నిర్దిష్ట నిఘా సమాచారం మేరకు ఆపరేషన్ ప్రారంభించాయి. నిన్న సాయంత్రం ప్రారంభమైన కాల్పులు రాత్రంతా అడపాదడపా కొనసాగాయి. మృతి చెందిన మావోయిస్టులను హుంగా, లక్కె , భీమే, నిహాల్ అలియాస్ రాహుల్ గా గుర్తించారు. వీరంతా నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సౌత్ సబ్ జోనల్ బ్యూరోకు చెందినవారని అధికారులు తెలిపారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి భద్రతా సిబ్బంది భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, ఒక ఇన్‌సాస్ రైఫిల్, ఒక .303 రైఫిల్, ఒక 12 బోర్ గన్, ఒక బీజీఎల్ లాంచర్, ఒక సింగిల్ షాట్ 315 బోర్ రైఫిల్, ఒక ఏకే-47 ఉన్నాయి. అనేక మ్యాగజీన్‌లు, లైవ్ రౌండ్లు, గ్రనేడ్‌లు, బీజీఎల్ సెల్‌లు, మావోయిస్టు సాహిత్యం, నిత్యావసర వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు.