కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. గత నెలలో గుండెపోటుతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 101 సంవత్సరాలు.
అచ్యుతానందన్ 2006 నుండి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సీపీఎం వ్యవస్థాపకుల్లో అచ్యుతానందన్ ఒకరు. 1967 నుంచి 2016 వరకు కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మూడుసార్లు విపక్ష నేతగా ఉన్నారు.
అచ్యుతానందన్ 1923 అక్టోబర్ 20న కేరళలోని అలప్పుజలో జన్మించారు. వెనుకబడిన నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించారు. వివిధ ఫ్యాక్టరీల్లో పని చేస్తూ కార్మిక ఉద్యమంలోకి అడుగు పెట్టారు. స్వాతంత్ర్యానికి ముందు ట్రావెన్‌కోర్ రాష్ట్రంలో భూస్వాములపై పోరాటం చేసి జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి.