తమిళనాడు తిరువల్లూరులోని చెన్నై-అరక్కోణం మార్గంలో ఓ గూడ్స్‌రైలు భారీ ప్రమాదానికి గురైంది. డీజిల్ ట్యాంకరుతో వెళ్తున్న రైలుకు ఈ తెల్లవారుజామున 5.50 గంటలకు మంటలు అంటుకున్నాయి. మొత్తం నాలుగు వ్యాగన్లు మంటల్లో చిక్కుకున్నాయి. నల్లని దట్టమైన పొగలు అంటుకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. గూడ్స్ రైలులో పెద్ద ఎత్తున ఇంధనం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు చెన్నై-అరక్కోణం మార్గంలో అన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.
రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రతినిధి తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.