పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పార్టీ ఇన్‌ఛార్జ్ ఝాన్సీరెడ్డిపై సొంత పార్టీకే చెందిన సీనియర్ నేత, తొర్రూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమండ్ల తిరుపతి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి ఆధిపత్యం శృతి మించుతోందని, దీనివల్ల పాలకుర్తిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి రెడ్డి మాట్లాడుతూ “ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్నప్పటికీ, ఝాన్సీరెడ్డి ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. ఆమెను స్వేచ్ఛగా పనిచేయనివ్వడం లేదు” అని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎన్నో ఇబ్బందులు పడి పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను, నాయకులను ఇప్పుడు పూర్తిగా పక్కనపెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో యశస్విని రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వారే ఇప్పుడు ఝాన్సీరెడ్డికి అత్యంత సన్నిహితులుగా మారారని తిరుపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “అందరినీ కలుపుకుపోవడంలో విఫలమయ్యారు. నేను అమెరికా నుంచి ఝాన్సీరెడ్డిని రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించాను. కానీ ఆ తర్వాత వారి తీరు మారింది. ఈ విధానం మార్చుకోవాలని ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు” అని ఆయన తెలిపారు.