కర్నూలు జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఓ చిన్నారితో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం కడప జిల్లా మైదకూరుకు స్కార్పియో వాహనంలో బయలుదేరింది. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్దకు చేరుకోగానే, రోడ్డు పక్కన ఉన్న ట్రాక్టర్‌ను వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జయింది.
దీంతో స్కార్పియోలోని ప్రయాణికులలో మున్ని (35), షేక్ కమాల్ బాషా (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మూడేళ్ల చిన్నారి షేక్ నదియాను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఆరుగురిని పోలీసులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.