ప్లాస్టిక్‌ను ఆరగిస్తున్న పురుగులు… కాలుష్యానికి కొత్త పరిష్కారం

V. Sai Krishna Reddy
1 Min Read

పర్యావరణానికి పెనుసవాలుగా మారిన ప్లాస్టిక్ కాలుష్య నివారణ దిశగా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. కొన్ని రకాల గొంగళి పురుగులు ప్లాస్టిక్‌ను తినగలవని, దానిని విచ్ఛిన్నం చేసి తమ శరీరంలో కొవ్వుగా మార్చుకోగలవని కనుగొన్నారు. కెనడాలోని బ్రాండన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.

యూనివర్సిటీలోని బయాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బ్రయాన్ కసోన్ నేతృత్వంలోని బృందం ‘మైనపు చిమ్మట గొంగళి పురుగుల’ (గ్రేటర్ వాక్స్ మాత్ లార్వా)పై ఈ పరిశోధన నిర్వహించింది. కేవలం 2000 మైనపు పురుగులు ఒక సాధారణ పాలిథిన్ కవర్‌ను 24 గంటల్లోనే పూర్తిగా విచ్ఛిన్నం చేయగలవని వారి అధ్యయనంలో తేలింది. ఈ పురుగులు పాలిథిన్‌ను జీర్ణం చేసుకుని, దానిని లిపిడ్ల రూపంలోకి మార్చి శరీర కొవ్వుగా నిల్వ చేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. “మనం అధికంగా కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు అవి శక్తిగా మారకుండా శరీరంలో ఎలా పేరుకుపోతాయో, ఈ పురుగులు కూడా ప్లాస్టిక్‌ను అదే విధంగా కొవ్వుగా మార్చుకుంటున్నాయి” అని డాక్టర్ కసోన్ వివరించారు.

బెల్జియంలోని ఆంట్‌వెర్ప్‌లో మంగ‌ళ‌వారం జరిగిన ఓ సైన్స్ సదస్సులో ఈ పరిశోధన వివరాలను సమర్పించారు. ఈ జీవ ప్రక్రియ వెనుక ఉన్న యంత్రాంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగితే, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు వినూత్న పరిష్కారాలు కనుగొనవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, కేవలం ప్లాస్టిక్‌ను మాత్రమే ఆహారంగా తీసుకుంటే ఈ పురుగుల ఆరోగ్యం దెబ్బతింటుందని, వాటి బరువు తగ్గి ఆయుష్షు కూడా క్షీణిస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు. మైనపు పురుగులతో పాటు మీల్‌వార్మ్స్, సూపర్‌వార్మ్స్, బొద్దింకలు వంటి ఇతర కీటకాలకు కూడా ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేసే సామర్థ్యం ఉందని గతంలో జరిగిన అధ్యయనాల్లో తేలింది. ఈ కొత్త పరిశోధన ప్లాస్టిక్ కాలుష్య నివారణకు జీవసంబంధ పరిష్కారాలపై మరిన్ని ఆశలు రేకెత్తిస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *