ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండటంతో శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టానికి చేరువైంది. ప్రస్తుతం సుంకేసుల, జూరాల నుంచి 1,72,705 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గానూ ఇప్పటికే 196.56 టీఎంసీలకు చేరింది. ఈ క్రమంలో శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 67,563 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండటంతో ఈ రోజు 11.50 గంటలకు శ్రీశైలం నుంచి రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు. సీఎం రాక సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లె రాజశేఖర్ అక్కడకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు.