24 ఏళ్ల తర్వాత ఢిల్లీ సీరియల్ కిల్లర్ అరెస్ట్… ట్యాక్సీ డ్రైవర్లే టార్గెట్

V. Sai Krishna Reddy
2 Min Read

పాతికేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న ఓ కిరాతక హంతకుడి ఆట ఎట్టకేలకు ముగిసింది. ట్యాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని దారుణంగా హత్యలు చేసి, వారి కార్లను దోచుకెళ్తున్న అజయ్ లంబా (48) అనే సీరియల్ కిల్లర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 24 ఏళ్ల క్రితం ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాలుగు దోపిడీ, హత్య కేసుల్లో ఇతను ప్రధాన నిందితుడు.

నేరాలు చేసే విధానం

అజయ్ లంబా నేరాలు చేసే విధానం చాలా పక్కాగా ఉండేది. తన సహచరులతో కలిసి ఉత్తరాఖండ్‌కు వెళ్లాలంటూ ట్యాక్సీని అద్దెకు తీసుకునేవాడు. మార్గమధ్యంలో డ్రైవర్‌కు మత్తుమందు ఇచ్చి హత్య చేసేవాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎవరికీ దొరకకుండా మారుమూల కొండ ప్రాంతాల్లో పడేసి, కారును తీసుకుని నేపాల్ సరిహద్దు దాటించి అక్కడ అమ్మేసేవాడు. 2001 సంవత్సరంలో ఈ ముఠా అనేకమంది డ్రైవర్లను ఇలాగే బలి తీసుకుంది.

ఈ కేసు వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదిత్య గౌతమ్ వెల్లడించారు. “నిందితుడు అజయ్ లంబా అత్యంత కిరాతకుడైన హంతకుడు. 2001లో ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్‌లో నలుగురు క్యాబ్ డ్రైవర్లను హత్య చేసి, వారి వాహనాలను దోచుకున్నాడు. మృతదేహాలు దొరక్కుండా ఉండేందుకు కొండ ప్రాంతాల్లో పడేశాడు” అని ఆయన తెలిపారు. లంబా చేతిలో హత్యకు గురైన నలుగురిలో ఇప్పటివరకు కేవలం ఒక్క డ్రైవర్ మృతదేహాన్ని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. ఇతని ముఠాలోని మరో ఇద్దరిని పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు.

మారువేషంలో జీవితం

ఆరో తరగతిలోనే చదువు ఆపేసిన లంబా, ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో ధీరేంద్ర, దిలీప్ నేగి అనే ఇద్దరితో కలిసి ఈ హత్యలకు పాల్పడ్డాడు. హత్యలు, దోపిడీలతో పాటు అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం, దొంగతనం వంటి కేసులు కూడా ఇతనిపై ఉన్నాయి. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 2008 నుంచి 2018 వరకు పదేళ్లపాటు నేపాల్‌లో తలదాచుకున్నాడు. ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి డెహ్రాడూన్‌కు మకాం మార్చాడు.

ఇటీవల గంజాయి సరఫరా కేసులో చిక్కడంతో లంబా అసలు స్వరూపం బయటపడింది. 2021లో ఢిల్లీలో, 2024లో ఒడిశాలో జరిగిన దోపిడీ కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే, 2001 నాటి హత్యల గురించి కానీ, తను పరారీలో ఉన్న విషయాన్ని కానీ ఎక్కడా బయటపెట్టలేదు. ప్రస్తుతం లంబాపై నాలుగు హత్య కేసులే నమోదైనప్పటికీ, ఇతను మరిన్ని నేరాలకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *