అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బావిలోకి కారు దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని పీలేరు మండలం బాలమువారిపల్లి పంచాయతీ పరిధిలోని కురవపల్లి వద్ద ఈ రోజు వేకువజామున జరిగింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందిన శివన్న, లోకేశ్, గంగరాజులు ఏపీలో వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చారు. పనులు ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా, వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం కారణంగా కారులో ప్రయాణిస్తున్న శివన్న, లోకేశ్, గంగరాజు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు బావి నుంచి కారు, మృతదేహాలను వెలికి తీయించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
