అవును, మానవ తప్పిదమే..!!

Submitted by Praneeth Kumar on Tue, 18/07/2023 - 17:53
Yes, Its human error..!!

అవును, మానవ తప్పిదమే..!!

హైదరాబాద్, జులై 18, ప్రజాజ్యోతి.        

దేశంలో వరద భీభత్సాలకు మానవ తప్పిదాలే కారణం. ఈ విషయాలు తెలిసి కూడా తెలియనట్టు ఇంకెంత కాలం నటిద్దాం. ఇది ఒక రకంగా ఆత్మహత్యాసదృశమే. ప్రస్తుతం దేశంలో వరదల వల్ల ఇప్పటికే 550 మందికి పైగా ప్రజలు తమ ఊపిరి కోల్పోయారు. జీవనదుల మార్గాన్ని అడ్డుకునే విధంగా నివాసాలు నిర్మించుకోవడం వల్లనే వర్షాకాలంలో ప్రజలకు కష్టాలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి కూడా మనం తప్పులు చేస్తున్నాము, పాలకులు చూస్తున్నారు.
నదులు ప్రవహించే మైదాన ప్రాంతాలు, దేశమంతా ఆక్రమణలకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో వరదల వల్ల లక్షలాది కుటుంబాలు ఇండ్లు వదిలి రోడ్లకిరువైపులా, ఫ్లై ఓవర్ల కింద తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది. యమునా నది కారణంగా దేశ రాజధాని నగరం ఢిల్లీ జలమయమైంది. లాల్‌ ఖిలా వద్దకూ వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటికే ఈ నది కాలుష్యంతో నిండిన నదిగా పేరుగాంచింది. గంగా, గోదావరి ఇలా దేశంలోని చిన్నా, పెద్ద నదులన్నీ కాలుష్యంతో నిండిపోయి వర్షకాలం వచ్చిందంటే ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాయి. 2010, 2013 ల్లోనూ ఢిల్లీలో వరదలు వచ్చాయి.
తాము ప్రవహించే మైదాన ప్రాంతాల్లో నివాసాలు నిర్మించుకున్నవారి మీద నదులు అప్పుడప్పుడు పగ తీర్చుకుంటున్నాయి. నదులను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టినపుడు నదులు కూడా ఆగ్రహిస్తాయి. యమున పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉన్నది. కొన్నిచోట్ల అభివృద్ధి లోపాలు, అవినీతి, నాణ్యత లేని పనులను కూడా తమ ఒత్తిడి ద్వారా నదులు బయటపడుతున్నాయి. యమున తన మార్గాన్ని మార్చుకోలేదు. మనుష్యులు, ప్రభుత్వాలే మరిచిపోయి ఆ మార్గంలో నిర్మాణాలు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నది వాస్తవం.
45 ఏండ్ల తర్వాత యమున నదిలో ఇంతటి నీరు వచ్చిచేరింది. 1978లో 207.49 మీటర్ల వరద వస్తే ఇప్పుడు 207.55 మీటర్లు దాటడం గమనార్హం. అసోంలో వరదల వల్ల ఐదు లక్షల మంది ఇండ్లు వదిలే పరిస్థితి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో హైవేలలో నాలుగు ఫీట్ల ఎత్తున నీరు వచ్చిచేరింది. కొన్నిచోట్ల హైవేలు స్విమ్మింగ్‌పూల్స్‌ను తలపిస్తున్నాయి.
హర్యానాలో రోడ్ల మీద పడవలు ఏర్పాటు చేసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోనూ వరద బీభత్సం సృష్టిస్తున్నది.
ఉత్తరాఖండ్‌లో నాలుగు వేల కోట్ల నష్టం జరిగిందని అంచనా.
హిమాచల్‌ప్రదేశ్‌లో 80 మంది, హర్యానాలో 10 మంది ఇలా దాదాపు 550 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలోనూ తిండి దొరకక వరద బాధితులు ఆగమాగమవుతున్నారు.
ఖనిజ సంపద కోసం అడ్డగోలుగా అడవుల నరికివేత, చెట్టు, పుట్టల, గుట్టలను ధ్వంసం చేయడం, అభివృద్ధి పనుల పేరిట ప్రకృతిని నాశనం చేయడం, చెరువులను, కాలువలను, నదులను, వాగులను కూడా వదలకుండా ఆక్రమణలు చేసి నిర్మాణాలకు పూనుకోవడం వల్లనే ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయనేది నూటికి నూరుపాళ్లు నిజం.
ఇవి ప్రకృతి వైపరీత్యాలు కావు ప్రజలు, ప్రభుత్వాలు తమ అవసరాలు, స్వార్థం కోసం చేసిన తప్పిదాలు. అందుకే జీవనదులను పారనీయండి, వాటి దారిని వాటికి వదిలిపెట్టండి. ప్రకృతి జోలికి వెళ్లకండి. చెట్టును, గుట్టను, పుట్టను బతుకనియ్యండి. ప్రకృతికి కోపం వస్తే కష్టం ఎలా ఉంటుందో, చూసి కూడా జాగ్రత్త పడకుంటే ఎలా.
ఇటు వరదలతో దేశం అతలాకుతలమవుతున్నది. అటు మే మూడు నుంచి మణిపూర్‌ మండిపోతున్నది.
అయినా ఇవేమీ పట్టని మన ప్రధాని ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లారు. 8 వేల కోట్ల విలువైన సకల సౌకర్యాల విమానంలో మొన్న అమెరికా వెళ్లి వచ్చి ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో
పర్యటించారు. పార్టీ నేతల సమావేశాల్లో మాట్లాడారు, తెలంగాణకు సైతం వచ్చివెళ్లారు. కానీ మణిపూర్‌ గురించి మాటా ముచ్చట లేదు, అక్కడికి వెళ్ళింది లేదు.
ఇప్పుడు ‘గావ్‌ జలే హనుమాన్‌ బాహర్‌ ’అనే చందాన ఫ్రాన్స్‌ వెళ్లారు. ఇదేం పట్టింపులేని తనం, అని దేశం ప్రశ్నిస్తున్నది. మణిపూర్‌ విషయంలో మీరెందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పండి, నోరు తెరువండి. మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ అడుగుతున్నది. ఇదేనా ‘సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌’ అంటే చెప్పండి..!!